న్యూఢిల్లీ, మే 22: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. కిష్టార్‌లోని కిరు జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రం టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు ఐదుగురిపై అభియోగాలు మోపింది. ప్రాజెక్టు సివిల్ వర్క్స్ కోసం పటేల్ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన ఫైల్‌ను ఆమోదించేందుకు రూ.300 కోట్లు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపింది.
ఇందుకు సంబంధించిన ఆధారాలతో అభియోగపత్రం దాఖలు చేసింది. మరోవైపు తాను అనారోగ్యంతో దవాఖానలో చేరానని, ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేనని సత్యపాల్ వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని తనను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్న నియంతకు తలొగ్గే ప్రసక్తే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.