న్యూఢిల్లీ, ఆగస్టు 1: నీట్-యూజీ పరీక్ష అక్రమాల కేసులో సీబీఐ గురువారం మొదటి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. 13 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చినట్టు అధికారులు తెలిపారు. పేపర్ లీక్‌తో పాటు పరీక్షలో అక్రమాలకు పాల్పడిన కేసుల్లో వీరి పాత్ర ఉందని చెప్పారు. ఈ కేసుల్లో విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా, నీట్-యూజీలో అక్రమాలు, పేపర్ లీకేజీకి సంబంధించి విచారణ జరుపుతున్న సీబీఐ ఆరు ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో బీహార్‌లో నమోదైన ఎఫ్ఐఆర్.. పేపర్ లీక్‌కు సంబంధించినది కాగా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు అక్రమాలు, చీటింగ్, ఒకరికి బదులుగా వేరొకరు పరీక్ష రాయడానికి సంబంధించినవి.
సీయూఈటీ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి సొంతంగా పరీక్ష
న్యూఢిల్లీ: సీయూఈటీ ద్వారా ప్రవేశాలు జరిగిన తర్వాత మిగిలిపోయిన యూజీ, పీజీ కోర్సుల సీట్లను భర్తీ చేయడంపై సెంట్రల్ యూనివర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. సొంత ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ద్వారా లేదా అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా వాటిని భర్తీ చేసుకోవచ్చని చెప్పింది. సీయూఈటీ ద్వారా చాలా రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత కూడా కొన్ని సీట్లు మిగిలిపోవడాన్ని గుర్తించిన తర్వాత యూజీసీ ఈ ఆదేశాలు జారీ చేసింది.