బెంగళూరు, నవంబర్ 23: అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై సీబీఐ చేస్తున్న దర్యాప్తును ఉపసంహరించాలన్న ప్రతిపాదనకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం గురువారం ఆమోదించింది. దీంతోపాటుగా కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసు విభాగం లేదా లోకాయుక్తకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఐటీ విభాగం 2017లో డీకే శివకుమార్ ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. ఐటీ సోదాల ఆధారంగా డీకేపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఆ తర్వాత ఈ కేసును గత బీజేపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ డీకే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయస్థానం ఏప్రిల్‌లో తిరస్కరించింది.