లాతూరు : నీట్ యూజీ 2026 పేపర్ లీక్(NEET Paper Leak) కేసులో రేణుకాయి కెమిస్ట్రీ క్లాసెస్ వ్యవస్థాపకుడు శివరాజ్ రఘునాథ్ మోటేగావ్‌కర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. లాతూర్‌లో ఇవాళ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శివరాజ్ మేటేగావ్కర్ను పాపులర్‌గా ఎం సర్ అని కూడా పిలుస్తారు. కెమిస్ట్రీలో ట్యూషన్ చెప్పే ఆయన.. సుమారు 100 కోట్ల విలువైన కోచింగ్ సెంటర్లను నడుపుతున్నారు. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్‌కు చెందిన లీకైన క్వశ్చన్ పేపర్.. శివరాజ్ మొబైల్ ఫోన్లో ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఆదివారం జరిగిన సోదాల్లో దీన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. లీకైన పేపర్ ఉండడం వల్ల అతన్ని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. లీకేజీ వ్యవహారంలో మోటేగావ్‌కర్ చాలా కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ ఆరోపిస్తున్నది. నీట్ పేపర్ లీకేజీ, ఆ తర్వాత ఆ పేపర్‌ను సర్క్యూలేట్ చేసినట్లు మోటేగావ్కర్పై ఆరోపణలు ఉన్నాయి. ఇతరులతో కలిసి ఆయన కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. మోటేగావ్‌కర్ ఫోన్‌కు క్వశ్చన్ పేపర్‌తో పాటు ఆన్సర్లు కూడా వచ్చినట్లు తెలిసింది. పరీక్ష కన్నా చాలా ముందే ఆ లీకేజ్ పేపర్ అందింది. అయితే అతను ఆ పేపర్‌ను చాలా మందికి ఫార్వర్డ్ చేసినట్లు కూడా గుర్తించారు.
మహారాష్ట్రలో నీట్, జేఈఈ ప్రిపేరయ్యే విద్యార్తుల్లో శివరాజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఆ రాష్ట్రంలో అతి పెద్ద కోచింగ్ బ్రాండ్‌గా ఆర్‌సీసీని ఆయన మార్చేశారు. అయితే నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో గత కొన్ని రోజుల నుంచి శివరాజ్‌ను సీబీఐ ప్రశ్నిస్తోంది. 1990 దశకంలో ఆయన సైకిల్‌పై తిరుగుతూ లాతూర్ సిటీలో కోచింగ్ ఇచ్చేవాడు. మొదట్లో ఓ రెంటు రూమ్‌లో పది మంది విద్యార్థులతో కోచింగ్ క్లాసులు నడిపారు. ఆయనే స్వయంగా నోట్స్ రాసేవారు. ఆ నోట్స్ చదివి పిల్లలు కెమిస్ట్రీలో మంచి మార్కులు తెచ్చుకునేవారు. మెల్లమెల్లగా లాతూరులో ఇన్స్టిట్యూట్ను ఆయన ఓపెన్ చేశారు. పోటీ పరీక్షలకు విద్యార్థులు ఆయన మెటీరియల్‌ను కొనేవారే. అంచలంచెలుగా లాతూర్ కోచింగ్ సెంటర్‌కు మహారాష్ట్రలో గుర్తింపు వచ్చింది. నీట్, జేఈఈ, సీఈటీ విద్యార్థులు ఆ సెంటర్‌కు చెందిన కెమిస్ట్రీ నోట్స్ చదివేవారు. ఆర్సీసీ కోచింగ్ సెంటర్‌కు లాతూర్‌తో పాటు పూణె, నాసిక్, ఛత్రపతి శంభాజీనగర్, నాందేడ్, సోలాపూర్, కొల్హాపూర్ పట్టణాల్లో కూడా కేంద్రాలు ఉన్నాయి. సుమారు 40 వేల మంది విద్యార్థులు ఆ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నారు. ఆ కోచింగ్ సెంటర్ విలువ సుమారు వంద కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.
శివరాజ్ మోటేగాన్క్ .. కెమిస్ట్రీలో ఎంఎస్సీ గోల్డ్‌మెడలిస్టు. దార్శనిక విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆయన పేరు ప్రస్తుతం నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బహిర్గతం అయ్యింది. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణితో శివరాజ్‌కు ఉన్న లింకులపై సీబీఐ ఆరా తీసింది. కెమిస్ట్రీ సంబంధిత ప్రశ్నలు లీకేజీ అయిన అంశంలో కులకర్ణిని అరెస్టు చేశారు. గతంలో ఆర్సీసీ కోచింగ్ సెంటర్లో కులకర్ణి క్లాసులు చెప్పినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ విషయంలో ఇద్దరికీ ఏవైనా సంబంధాలు ఉన్నాయా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.