Twisha Sharma : నటి, మోడల్ త్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఆమె అత్త, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆరున్నర గంటల విచారణ అనంతరం, గురువారం సాయంత్రం సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ముందుస్తు బెయిల్ కోరుతూ గిరిబాలా సింగ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అంతకుముందు ఆమెకు ఈ నెల 15న సెషన్స్ కోర్డు ముందస్తు బెయిల్ ఇచ్చింది. కానీ, దీనిని హైకోర్టు రద్దు చేసింది. త్విషా మృతి ఘటనలో గిరిబాలా మీద ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె బెయిల్ రద్దు చేస్తున్నట్లు వెకేషన్ జడ్జ్ దేవ్నారాయణ్ మిశ్రా ప్రకటించారు. త్విషా మరణించడానికి ముందే ఆమె ఒంటిపై గాయాలున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని, దీనిని పరిగణనలోకి తీసుకుని కూడా బెయిల్ నిరాకరిస్తున్నట్లు జడ్జి తెలిపారు. గిరిబాల న్యాయ వ్యవస్థలో మూడు దశాబ్దాలకుపైగా పని చేశారని, ఈ కేసుకు సంబంధించి న్యాయవ్యవస్థ మీద ఆమెకు ఏమాత్రం గౌరవం ఉన్నా సీబీఐ ముందు లొంగిపోయి, సహకరించాలని జడ్జి సూచించారు. కోర్టు నిర్ణయాన్ని త్విషా శర్మ కుటుంబం స్వాగతించింది.
త్విషా శర్మ కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. త్విష భర్త సమర్ధ్ సింగ్, అతడి తల్లి గిరిబాలా ఇద్దరూ వరకట్నం కోసం త్విషను వేధించారు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారు. వారి వల్లే ఆమె మరణించింది. త్విష మరణం అనంతరం తనకున్న పరిజ్ఞానం ఉపయోగించి ఆధారాల్ని చెరిపేసేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆమెపై కూడా విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని త్విష కుటుంబం కోరుతోంది. త్విష భర్త సమర్ధ్ సింగ్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతడు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. కేసును సీబీఐ విచారిస్తోంది.