MeToo | తిరువనంతపురం: మలయాళం సినిమా ఇండస్ట్రీలో ‘మీటూ’ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్నది. పలువురు ప్రముఖ నటులు, డైరెక్టర్లపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మాలీవుడ్‌లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను బహిరంగపర్చిన తర్వాత పలువురు మహిళా నటులు తమకు ఎదురైన దారుణ పరిస్థితులపై గళం విప్పుతున్నారు. ప్రముఖ నటులు ఎం ముఖేశ్(సీపీఎం ఎమ్మెల్యే), జయసూర్య, మునియన్పిళ్ల రాజు, ఇదవేళ బాబులు 2013లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా తనపై శారీరకంగా, మానసికంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మలయాళీ నటీ మిను మునీర్ సోమవారం ఆరోపించారు.
జయసూర్య తనను కౌగిలించుకొన్నాడని, బలవంతంగా ముద్దు పెట్టాడని పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(ఏఎంఎంఏ) సభ్యత్వం కోరితే, కార్యదర్శి ఇదవేళ బాబు తన ఫ్లాట్‌కు రమ్మన్నాడని, అదేవిధంగా ముఖేశ్ ఆయన చెప్పిన దానికి అంగీకరించనందుకు తనకు సభ్యత్వం రాకుండా చేశాడని ఆరోపించారు. అయితే మిను మునీర్ ఆరోపణల వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని, ఆరోపణలపై దర్యాప్తు జరపాలని మునియన్పిళ్ల రాజు కోరారు. నటుడు, డైరెక్టర్ బాబురాజ్పై ఓ జూనియర్ ఆర్టిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ యువతి పేర్కొన్నారు. తమపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో డైరెక్టర్ రంజిత్, నటుడు సిద్ధిఖ్ ఏఎంఎంఏ పదవులకు ఆదివారం రాజీనామా చేశారు.