అహ్మదాబాద్ : గుజరాత్ తీరప్రాంతంలో శనివారం పాక్ సముద్ర భద్రతా ఏజెన్సీ (PMSA) కాల్పులకు తెగబడగా.. ఓ భారతీయ మృత్యుకారుడు మృత్యువాతపడ్డాడు. ఈ క్రమంలో గుజరాత్ పోలీసులు పీఎంఎస్ఏకు చెందిన పది మంది సిబ్బందిపై హత్య కేసు నమోదు చేశారు. తీర ప్రాంతం గుండా వెళ్తున్న పడవపై పీఎంఎస్ఏ సిబ్బంది కాల్పులు జరుపగా.. మహారాష్ట్ర పాల్ఘర్కు చెందిన జాలరి శ్రీధర్ రమేశ్ చమ్రే మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనను భారత్ సీరియస్గా తీసుకున్నది. దౌత్యస్థాయిలో విచారణ చేపట్టనున్నది. అక్టోబర్ 25న గుజరాత్లోని పోర్బంద్ నుంచి భారతీయ పడవ బయలుదేరిందని అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారని, వీరిలో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారు, నలుగురు గుజరాత్, ఒకరు డయ్యూకు చెందిన వారని అధికారులు పేర్కొన్నారు.