లక్నో: ఒక ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో భారీగా గంజాయి సేవిస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో గంజాయిని చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ఎంపీపై కేసు నమోదైంది. (Case Against SP MP) ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఇటీవల మీడియాతో మాట్లాడారు. కుంభమేళాలో పెద్ద మొత్తంలో గంజాయి సేవిస్తారని తెలిపారు. గంజాయితో నిండిన గూడ్స్ రైలు మొత్తం కూడా కుంభమేళాకు సరిపోదని ఎద్దేవా చేశారు. మతపరమైన కార్యక్రమాలు, పండుగల సమయాల్లో గంజాయిని ‘ప్రసాదం’గాను వినియోగిస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో గంజాయిని చట్టబద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా, ఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ వ్యాఖ్యలపై సాధువులు, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఘాజీపూర్ పోలీసులు స్పందించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సంబంధిత సెక్షన్ల కింద ఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీపై కేసు నమోదు చేశారు.