ఢిల్లీ, మే 12 : మోదీ సర్కారు పాక్‌తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ కార్టూనిస్ట్ మంజుల్ సెటైర్లు వేశారు. కాల్పుల విరమణ అవగాహన కుదుర్చుకున్న 3 గంటలకే దాయాది దేశం దాన్ని ఉల్లంఘించడాన్ని చూస్తుంటే 14 ఏండ్ల కిందట తాను వేసిన ఓ కార్టూన్ గుర్తుకొస్తున్నదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు నాటి కార్టూన్‌ను ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనను చూస్తుంటే 2011 ఫిబ్రవరిలో నేను వేసిన ఈ కార్టూన్ గుర్తుకొస్తున్నది.
అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ పాక్‌తో కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నించగా.. మోదీ ఆయనను విమర్శించారు. కానీ, ప్రధాని మోదీ ఇప్పుడు పాక్‌తో కాల్పుల విరమణకు అవగాహన కుదుర్చుకొని తనను తానే అపహాస్యం చేసుకున్నారు. ఒకటికి మించి ఎక్కువ పవర్ సెంటర్స్ ఉన్న పాకిస్థాన్‌తో ఒప్పందం చేయడం అత్యంత క్లిష్టమైనది. ఈ 14 ఏండ్లలో ఏం మారలేదు’ అని మంజుల్ ట్వీట్ చేశారు.