Road Accident | మధ్యప్రదేశ్లోని నారాయణగఢ్ పోలీస్స్టేషన్ పరిధి ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడు సహా వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిని జిల్లా ఉన్హేల్కు చెందిన అంతరి మాతాజీ దర్శానికి వ్యాన్లో బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాహనం బుధ-తక్రావత్ ఫాంటా వద్ద బైక్ను ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపు తప్పి రక్షణ గోడలేని బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో క్షతగాత్రులను రక్షించేందుకు బావిలోకి దిగిన మరో యువకుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో బైకర్ సైతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
నీముచ్ జిల్లా మానస ప్రాంతంలోని అంతరి మాత ఆలయాన్ని దర్శించేందుకు ఉజ్జయిని జిల్లాలోని ఉన్హెల్ నుంచి పది మంది వ్యాన్లో బయలుదేరినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మూడేళ్ల బాలికతో సహా నలుగురుని కాపాడి మాండ్సౌర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ప ముఖ్యమంత్రి జగదీష్ దేవ్డా, కలెక్టర్ అదితి గార్గ్, ఎస్పీ అభిషేక్ ఆనంద్, ఇతర పోలీసుల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వ్యాన్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే అదుపు తప్పి రోడ్డున పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మృతుల సంఖ్య స్పష్టంగా లేదని.. ప్రమాదం సమయంలో వ్యాన్లో ఇద్దరు పిల్లలు సహా 13 మంది వరకు ఉన్నట్లుగా సమాచారం ఉందన్నారు. నలుగురిని ఆసుపత్రిలో చేర్పించారని.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బావిలో విష వాయువు ఉండడం ఇబ్బందికరంగా ఉందన్నారు.