Cancer | న్యూఢిల్లీ: పొట్టిగా ఉండేవారితో పోలిస్తే కాస్తంత పొడవు ఉంటే ఆ ఆత్మవిశ్వాసమే వేరుగా ఉంటుంది. అయితే పొడవు మన పాలిట శాపంగా మారుతుందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఎత్తు ఎక్కువ ఉన్నవారికి క్యాన్సర్ ముప్పు అధికమని ‘యూకే మిలియన్ విమెన్ స్టడీ’ తేల్చింది. తాము అధ్యయనం చేసిన 17 మంది పొడుగు వ్యక్తులలో 15 మంది క్యాన్సర్ బాధితులేనని తెలిపింది. పొట్టి వారితో పోలిస్తే పొడవుగా ఉన్న వారు త్వరగా క్యాన్సర్ బారినపడతారని అధ్యయనం పేర్కొన్నది. పొడుగు వ్యక్తులు పాంక్రియాస్, ఓవరీ, ప్రొస్టేట్, కిడ్నీ, స్కిన్ (మెలానోమా), బ్రెస్ట్ (మెనోపాజ్ ముందు, వెనక), పెద్దపేగు, యుటెరస్ (ఎండోమెట్రియం) వంటి క్యాన్సర్ల బారినపడే అవకాశం ఉన్నదని వరల్డ్ క్యాన్సర్ రిసెర్చ్ ఫండ్ తెలిపింది. పెరిగే ప్రతి 10 సెంటీమీటర్ల ఎత్తుకు క్యాన్సర్ వచ్చే ముప్పు 16 శాతం ఉంటుందని వివరించింది.
ఎత్తు ఎక్కువగా ఉన్న వారిలో కణాలు పెద్ద సంఖ్య లో ఉంటాయి. క్యాన్సర్ ముప్పుకు ఇది కూడా ఒక కారణం. పొడవు ఎక్కువగా ఉన్న వ్యక్తులలో ఎక్కువ కణాలతో పొడవాటి పెద్ద పేగు ఉంటుంది. ఇది పెద్ద పేగు క్యాన్సర్కు కారణం అవుతుంది. ఒక కణం విభజనకు గురై కొత్త కణం తయారైనప్పుడు ఏర్పడే జన్యువులు దెబ్బతినడం వల్ల కూడా క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. ఇలా ఎక్కువ సార్లు జన్యువులు దెబ్బతింటే క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం పొడవాటి వ్యక్తులలో పెద్ద మొత్తంలో కణాలు క్యాన్సర్ అభివృద్ధికి కారకంగా మారతాయి. ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్ 1 (ఐజీఎఫ్-1) హార్మోన్ వల్ల కూడా క్యాన్సర్ బారినపడే అవకాశం ఉన్నది. అయితే, ఐజీఎఫ్-1 స్థాయిలు సగటు కంటే ఎక్కువగా ఉంటే ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.