న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల కొత్త క్యాన్సర్ (Cancer) కేసులు నమోదయ్యాయి. ఆ ఏడాది 97 లక్షల మంది క్యాన్సర్తో మరణించారు. క్యాన్సర్కు కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల తాజా అధ్యయనం కొత్త ఆందోళనను రేకెత్తిస్తున్నది. క్యాన్సర్ కణాల్లో డ్రగ్స్ రెసిస్టెన్స్ (Drug Resistance) ఎలా పనిచేస్తుందో పరిశోధకులు వివరించారు. డ్రగ్ థెరపీ సమయంలో కొన్ని క్యాన్సర్ కణాలు మరణించినట్టు నటించి, ట్రీట్మెంట్ నుంచి తప్పించుకుంటాయని వీరి పరిశోధనలో తేలింది. కొన్ని కేసులలో ఈ థెరపీ ఆ కణాలను చంపడానికి బదులుగా, వాటి పెరుగుదలకు కారణమవుతున్నదని పరిశోధకులు గుర్తించారు.