న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా(Air India) విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో చికాగో వెళ్తున్న ఏఐ127 విమానాన్ని అత్యవసరంగా కెనడాలోని ఇకాలుత్ ఎయిర్పోర్టులో దించారు. సుమారు 18 గంటలు పాటు అక్కడే ఆ విమానంలోని ప్రయాణికులు ఉండిపోయారు. 191 మంది ప్రయాణికులు ఆ ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నారు. వీరితో పాటు మరో 20 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రయాణికులను చికాగోకు తరలిస్తున్నారు. కెనడా వైమానిక దళానికి చెందిన విమానంలో ఆ ప్రయాణికులను పంపిస్తున్నారు. కెనడా ఎయిర్ఫోర్స్ విమానంలో ప్రయాణికులను చికాగోకు తరలిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇకాలుత్ ఎయిర్పోర్టులో తమ విమానాన్ని దింపేందుకు సహకరించిన కెనడా అధికారులకు ఎయిర్ ఇండియా థ్యాంక్స్ తెలిపింది. ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 777-300 ఈఆర్ విమానాన్ని బాంబు బెదిరింపు రావడంతో మంగళవారం కెనడాకు తరలించారు. మరో వైపు గత రెండు రోజుల నుంచి ఇప్పటి వరకు 10 భారతీయ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. కానీ ఎటువంటి అనుమానిత వస్తువులను గుర్తించలేదు.