న్యూఢిల్లీ, జూలై 5:ఈ ఏడాది సెప్టెంబర్ 1 తర్వాత కెనడా స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా దరఖాస్తులో భాగంగా జీవన వ్యయ నిధులు 2,000 కెనడా డాలర్లు(రూ. 1.25 లక్షలు) అధికంగా చూపాల్సి ఉంటుంది. ఒక్కో దరఖాస్తుదారు తమ స్టూడెంట్ వీసా దరఖాస్తుతోపాటు 22,895 కెనడా డాలర్లు(రూ.13.12 లక్షలు)తమ జీవన వ్యయ నిధులుగా చూపాలని ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా(ఐఆర్సీసీ) తెలిపింది.
క్యూబెక్ నగర వెలుపల ఉన్న అన్ని ప్రావిన్సులు, సరిహద్దులలో స్టడీ పర్మిట్ అప్లికేషన్లకు ఈ సవరణ వర్తిస్తుందని, మొదటి సంవత్సరం ట్యూషన్, ట్రావెల్ ఫీజులకు ఇది అదనమని ఐఆర్సీసీ తెలిపింది. విద్యార్థులు తమ వెంట వచ్చే తమ కుటుంబ సభ్యునితోపాటు తమను తాము పోషించుకోగలమన్న ఆర్థిక స్తోమతును చూపించాల్సి ఉంటుంది. సవరించిన జీవనవ్యయ నిధులను జూన్ 2న ఐఆర్సీసీ ప్రకటించగా ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. దీంతో దీని ప్రభావం భారతీయ విద్యార్థులపై పడనుంది.