న్యూఢిల్లీ: భారతీయులపై కెనడా కఠినంగా వ్యవహరిస్తున్నది. భారతీయ వలసదారులను బలవంతంగా పంపించేస్తున్నది. 2019 నుంచి వీరి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 2024లో రికార్డు స్థాయిలో భారతీయ వలసదారులను కెనడా నుంచి పంపించేశారు. ఈ ఏడాది ఆ రికార్డు చెరిగిపోయే అవకాశం ఉంది. 2019లో 625 మంది భారతీయులను కెనడా ప్రభుత్వం ఆ దేశం నుంచి బలవంతంగా పంపించేసింది. 2024లో వీరి సంఖ్య మూడు రెట్లకు పెరిగింది. ఈ ఏడాది జూలై 28నాటికి 1,891 మందిని పంపించేసింది. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ఇటీవల టొరంటోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విదేశీ నేరగాళ్లను దేశం నుంచి పంపించేస్తారా? అని మీడియా అడిగినపుడు కార్నీ స్పందిస్తూ, “ఔను” అని చెప్పారు. మెరుగైన ప్రణాళిక, వనరుల సాయంతో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. ఇమిగ్రేషన్ సిస్టమ్లో విస్తృత స్థాయిలో సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. మరోవైపు, కెనడాలో యాంటీ ఇమిగ్రేషన్ సెంటిమెంట్ కూడా తీవ్రమవుతున్నది.