చండీగఢ్: ఉద్యోగం పోతుందన్న భయం తనకు లేదని సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ (CISF constable Kulwinder Kaur) తెలిపింది. అమ్మకు గౌరవం కోసం వేల ఉద్యోగాలు పోగొట్టుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. మహిళలు రూ. వంద తీసుకుని రైతు నిరసనల్లో పాల్గొంటారని గతంలో ట్వీట్ చేసిన నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంపపై కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కొట్టింది. తన తల్లి కూడా రైతుల నిరసనలో పాల్గొన్నట్లు ఆమె చెప్పింది. గురువారం చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో కుల్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేశారు. శుక్రవారం ఆమెను అరెస్ట్ చేయడంతోపాటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుల్విందర్ కౌర్ శుక్రవారం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. ‘ఈ ఉద్యోగం పోతుందనే భయం లేదు. మా అమ్మ గౌరవం కోసం ఇలాంటి వేల ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని హిందీలో ట్వీట్ చేసింది.
మరోవైపు కంగనా రనౌత్ చెంపపై కొట్టిన సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌కు పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆమెపై ఎలాంటి అనుచిత చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేశాయి. జూన్ 9న నిరసనకు సిద్ధమయ్యాయి. ఆ రోజున పంజాబ్‌లోని మొహాలీలో కానిస్టేబుల్‌కు న్యాయం పేరుతో ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాలైన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) శుక్రవారం ప్రకటించాయి.
కాగా, ఈ సంఘటనపై సరైన విచారణ కోసం పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్‌ను కలిసే యోచనలో ఉన్నట్లు ఎస్కేఎం నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. జూన్ 9 న మొహాలీలోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి ‘ఇన్సాఫ్ మార్చ్’ చేపడతామని అన్నారు.
मुझे नौकरी की फिक्र नहीं है,
मां की इज्जत पर ऐसी हजारों नौकरियां कुर्बान है- कुलविंदर कौर— Kulvinder Kaur (@Kul_winderKaur) June 7, 2024