న్యూఢిల్లీ : అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ 2026-27 మొదటి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసినట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీడీపీ వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నప్పటికీ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారుతుందా అనే అంశంపై దేశంలోని ఇద్దరు ప్రముఖ ఆర్థికవేత్తలు సందేహాలు వ్యక్తం చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మరింత అధిక వృద్ధి రేటు అవసరమని వారు పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు పూర్తయ్యేనాటికి అధిక ఆదాయాలు, మెరుగైన జీవన ప్రమాణాలు, విస్తృత స్థాయి ఆర్థికాభివృద్ధితో దేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యం. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ అధికారిక జాతీయ ప్రధాన అజెండా.
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, మాంటెక్ సింగ్ అహ్లువాలియా దేశ ఆర్థిక పనితీరుకు సంబంధించిన కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం విషయంలో మాత్రం దాదాపు ఒకే విధమైన అభిప్రాయానికి వచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలంటే గణనీయమైన, నిలకడతో కూడిన వృద్ధి పథం అవసరమని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం కాదనే దృఢమైన అభిప్రాయంతో తాను ఇప్పటికీ ఉన్నట్టు భారత్కు ఐఎంఎఫ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భల్లా పేర్కొన్నారు. ప్రణాళికా సంఘం మాజీ డిప్యుటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా కూడా దాదాపు అటువంటి నిర్ణయానికే వచ్చారు. వికసిత్ భారత్ అనే దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించే దిశగా మనం సరైన మార్గంలో లేమని ఆయన అన్నారు. అందుకు మనకు చాలా అధిక వృద్ధి రేటు అవసరమని కూడా ఆయన అన్నారు.