జైపూర్: ఫోన్ లేనిదే పొద్దు గడవని ఈ రోజుల్లో రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలోని 15 గ్రామాల పెద్దలు ఒక ఆశ్చర్యకర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక నుంచి ఆ గ్రామ కోడళ్లు కెమెరా ఫోన్లు వాడరాదని నిర్ణయం తీసుకున్నారు. ఇది జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. బాలికలు చదువుల కోసం ఇంటి వద్ద మొబైల్ ఫోన్లను వాడవచ్చు. అయితే బహిరంగ కార్యక్రమాలకు, పొరుగు ఇళ్లకు ఫోన్లను తీసుకుపోరాదు. కోడళ్లయితే కేవలం కీ ప్యాడ్ ఫోన్లు తప్ప స్మార్ట్ ఫోన్లను వాడరాదు. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఉండటం వల్ల వాటిని పిల్లలు విస్తృతంగా వినియోగిస్తున్నారని, వాటికి బానిసలవుతున్నారని, అందుకే పెద్దలు వాడకుండా ఉంటే పిల్లలూ దాన్ని తప్పక పాటిస్తారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామపెద్దలు తెలిపారు.