Californiam | పాట్నా: ముగ్గురు సభ్యుల అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు వారి నుంచి రూ.850 కోట్ల విలువైన 50 గ్రాముల రేడియో యాక్టివ్ పదార్థం ‘కాలిఫోర్నియం’ను స్వాధీనం చేసుకున్నారు. గ్రాము దాదాపు రూ.17 కోట్లు పలికే ఈ పదార్థాన్ని అణు విద్యుత్తు కేంద్రాలు మొదలుకొని క్యాన్సర్ చికిత్స వరకు వివిధ రంగాల్లో వివిధ రూపాల్లో వాడుతుంటారు. తమ వద్దనున్న ఈ పదార్థాన్ని విక్రయించేందుకు కొన్ని నెలలుగా ఈ గ్యాంగ్ ప్రయత్నిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బాల్‌థారి చెక్‌పోస్టు వద్ద నిందితులను కాపుకాసి పట్టుకున్నారు.
వారు తమను తాము ఐఐటీ మద్రాస్‌కు చెందిన వారిగా చెప్పుకున్నారని, నిందితుల వద్ద ల్యాబ్ టెస్ట్ రిపోర్టు కూడా ఉన్నదని గోపాల్‌గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ తెలిపారు. అయితే, ఐఐటీ మద్రాస్‌ను సంప్రదించిన తర్వాత వారు చెప్తున్నది అబద్ధమని తేలిందని పేర్కొన్నారు. కాలిఫోర్నియంను కొనడం, విక్రయించడం దేశంలో చట్టరీత్యా నేరం కావడంతో అసలు అది వారికి ఎలా దొరికింది? ఎవరు కొనుగోలు చేయబోతున్నారు? అన్నదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సీజ్ చేసిన పదార్థాన్ని పరీక్ష కోసం అణుశక్తి విభాగానికి పంపినట్టు తెలిపారు. మూడేండ్ల క్రితం లక్నోలో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 340 గ్రాముల కాలిఫోర్నియంను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఆ పదార్థం గ్రాము విలువ రూ. 19 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కాగా, తాజా కేసులో అరెస్ట్ అయిన నిందితులు తమకు ఆ పదార్థాన్ని బొగ్గు గనిలో పనిచేసే వ్యక్తి ఇచ్చినట్టు తెలిపారు.