న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 శాతం కరవు భత్యాన్ని పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో డీఏ పెంపుతో పాటు భారత్ మేరీటైం ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గ్రామీణ సడక్ యోజన మూడో దశను 2028 వరకు పొడిగించింది. వ్యవసాయ మార్కెట్లు, స్కూళ్లు, దవాఖానలకు వెళ్లే రోడ్ల పనులను ఈ దశలో చేపడతారు.
డీఏ పెంపు నిర్ణయం ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. అలాగే ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన-3 పథకాన్ని పొడిగించారు. మైదాన ప్రాంతాల్లోని వంతెనలకు 2028 మార్చి వరకు పొడిగించగా, కొండ ప్రాంతాల్లోని వంతెనలకు 2029 మార్చి వరకు సమయం ఇచ్చారు. ఢిల్లీ-గువాహటి మధ్యరూ. 14,296 కోట్లతో చేపట్టిన హైడెన్సిటీ నెట్వర్క్లో భాగంగా ఘజియాబాద్-సీతాపూర్ సెక్షన్, రాజమండ్రి-విశాఖ తదితర రైల్వే లైన్ల నిర్మాణాన్ని చేపట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది రేవా జిల్లాలోని మహాన మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు 82.39 కోట్లతో ఆమోదం తెలిపారు.
రూ.12,980 కోట్ల సార్వభౌమ హామీతో కూడిన దేశీయ సముద్ర బీమా సదుపాయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత దేశ నియంత్రణలో ఉన్న, భారతదేశానికి వచ్చే ఓడలకు ఇది వర్తిస్తుంది. దీని కాలపరిమితి 10 సంవత్సరాలు, 15 ఏండ్ల వరకు పొడిగించుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సముద్ర రవాణాలో ఏర్పడిన అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.