గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 02:58:01

సరోగసీ బిల్లుకు ఓకే

సరోగసీ బిల్లుకు ఓకే
  • విడాకులు తీసుకున్న మహిళలకు, వితంతువులకూ ఇకపై లబ్ధి
  • 1,480 కోట్లతో నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ మిషన్‌
  • కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు

న్యూఢిల్లీ: సరోగసీ (అద్దెగర్భం) నియంత్రణ బిల్లు-2020కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. సమావేశం అనంతరం కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, స్మృతీ ఇరానీ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ చేసిన సిఫార్సులన్నింటినీ బిల్లులో పొందుపరిచినట్లు జవదేకర్‌ తెలిపారు. వాణిజ్యపరమైన సరోగసీని నిషేధించి, ‘నిస్వార్థమైన’ సరోగసీని అనుమతించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకువచ్చినట్లు చెప్పారు. భారతీయ దంపతులు మాత్రమే దేశంలో సరోగసీ (అద్దెగర్భం) విధానాన్ని ఎంచుకునేలా ప్రతిపాదనలు పొందుపరిచినట్లు స్మృతీ ఇరానీ తెలిపారు. 


వచ్చే నెలలో ప్రారంభంకానున్న మలివిడుత బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. 2019 ఆగస్టులో లోక్‌సభ ఆమోదం పొందిన సరోగసీ ముసాయిదా బిల్లుకు పలు సవరణలు చేసి తాజా బిల్లు తెచ్చారు. అద్దెగర్భానికి అంగీకరించే మహిళ.. దంపతులకు సమీప బంధువై ఉండాలన్న నిబంధనతోపాటు నాటి బిల్లులోని పలు ప్రతిపాదనలపై విమర్శలు రావడంతో కేంద్రం ఆ బిల్లును రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్‌ యాదవ్‌ నేతృత్వంలోని కమిటీ వివిధ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి పలు సిఫార్సులు చేసింది. తాజా బిల్లు ప్రకారం.. అద్దెగర్భం ఇచ్చేందుకు మహిళ సమీప బంధువే కానక్కర్లేదు. అలాగే విడాకులు తీసుకున్నవారైనా, భర్తను కోల్పోయినవారైనా సరోగసీ ద్వారా బిడ్డను కనొచ్చు. సరోగసీ నియంత్రణకు జాతీయ, రాష్ట్రస్థాయిలో సరోగసీ బోర్డులను ఏర్పాటుచేస్తారు. సరోగసీకి సిద్ధపడే మహిళకు బీమా సౌకర్యాన్ని 16 నెలల నుంచి 36 నెలలకు పొడిగించారు. 


మరికొన్ని నిర్ణయాలు..

రూ.1,480 కోట్లతో ‘నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ మిషన్‌' ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చాబహార్‌ పోర్ట్‌ నిర్మాణం సాఫీగా సాగేందుకు మార్గం సుగమం చేస్తూ ‘పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (డీపీఈ)’ మార్గదర్శకాల నుంచి ‘ఇండియా పోర్ట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ (ఐపీజీఎల్‌)’కు క్యాబినెట్‌ మినహాయింపునిచ్చింది. ఉమ్మడి జాబితాలోని కేంద్ర చట్టాలను జమ్ముకశ్మీర్‌లోనూ అమలుచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


logo