2024-25 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలలో పీహెచ్డీ ప్రవేశాలకు జాతీయ అర్హత పరీక్ష (నెట్) నిర్వహించాలనడం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని ధ్వంసం చేయడమే. ఆయా వర్శిటీలు సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష స్థానంలో నెట్‌ను నిర్వహించాలంటూ దళిత, బహుజన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కులోన్మాద కుట్రలను విద్యార్థి లోకం తిప్పికొట్టాలి.
మార్చి 13వ తేదీన న్యూ ఢిల్లీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ యూనివర్సిటీలు సొంతంగా నిర్వహించే పీహెచ్డీ ప్రవేశ పరీక్ష స్థానంలో జాతీయస్థాయిలో ఏక పరీక్ష (నెట్)ను ప్రవేశపెట్టారు.
ఈ నూతన పరీక్ష విధానంలో నెట్‌ను మూడు కేటగిరీలుగా విభజించారు. అందులోని 1వ కేటగిరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత ఇచ్చారు. 2వ కేటగిరిలో ఫెలోషిప్ ఇవ్వకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికే అర్హత ఇచ్చారు. ఇక 3వ కేటగిరిలో ఫెలోషిప్ గాని, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత ఇవ్వకుండా పీహెచ్డీ కోర్సుల్లో చేరేందుకు మాత్రమే అర్హత ఇచ్చారు. దాన్ని కూడా ఏడాదికే పరిమితం చేశారు. నెట్ పరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండటంతో దక్షిణ భారతదేశ విద్యార్థులు పరీక్షల్లో అధిక మార్కులు సాధించలేరు. దీంతో కేటగిరి-1లో వీరు ఫెలోషిప్ పొందలేరు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కూడా కోల్పోతారు. వివిధ యూనివర్సిటీల్లో ఏటా పీహెచ్డీ ఖాళీలు భర్తీ చేసేందుకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలనే విధానం లేకపోవడం వల్ల యూజీ నెట్‌లోని 3వ కేటగిరి సాధించినప్పటికీ విద్యార్థులు ఏడాది కాల పరిమితి నిబంధన వల్ల కనీసం అడ్మిషన్ కూడా పొందలేని పరిస్థితి ఏర్పడనున్నది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు, రాష్ట్ర భాషలు, మాతృభాషలలో చదువుకున్న విద్యార్థులు, పేద, దళిత, బహుజన విద్యార్థులు పట్టణాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో ఇంగ్లీష్ భాషలో చదివే విద్యార్థులకు పోటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతున్నది. అనేక కష్టనష్టాలు, అణచివేతకు, అవమానాలకు గురై పీజీ వరకు చదువుకున్న దళిత, బహుజన విద్యార్థులు ఈ నిర్ణయంతో ఉన్నత విద్యాసంస్థల నుంచి గెంటివేయబడుతారనేది నూటికి నూరుపాళ్లు వాస్తవం.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బహిర్గతం చేసిన యూజీసీ సంస్థ విద్యార్థుల ఆందోళనలను ఎలక్షన్ కోడ్ పేరుతో అణచివేసే ఉద్దేశంతోనే చేసింది. కొత్త విద్యా విధానం-2020 అమలులో భాగంగానే ఈ ఏకపరీక్ష విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈ సందర్భంగా ప్రకటించిన యూజీసీ తొందరలోనే తన అస్తిత్వాన్ని కోల్పోయి రద్దయ్యే పరిస్థితి కూడా ఉన్నది.
కొత్త విద్యా విధానంలోనే యూజీసీని రద్దు చేయాలని, ఆ స్థానంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ) ఏర్పాటు చేయాలని ఉంది. గత కొన్నేండ్లుగా ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించిన యూజీసీని కూడా కనుమరుగు చేసే పరిస్థితి నేడు నెలకొన్నది. ఈ దేశ పాలకులు అనుసరించిన విధానాలతో ఇప్పటికే భారత విద్యా విధానంలో కొందరికే విద్య అనే పరిస్థితికి నెట్టివేయబడింది. విద్య కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణతో పూర్తి కేంద్రీకరణకు పూనుకున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ పదేండ్ల కాలంలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. ఏక పరీక్ష విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోరాడేందుకు విద్యార్థులు ముందుకురావాలి.
(వ్యాసకర్త: పీడీఎస్ఎఫ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు)
-ఆవుల నాగరాజు