బెంగళూరు: ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన బస్ స్టాప్, దానికి సంబంధించిన స్టీల్ స్ట్రక్చర్ చోరీ అయ్యింది. (Bus stop stolen) ఈ విషయం తెలుసుకున్న అధికారులు షాక్ అయ్యారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ చోరీపై దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న బస్ షెల్టర్లను బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) నిర్వహిస్తున్నది. అయితే కన్నింగ్హామ్ రోడ్లో ఉన్న బస్ స్టాప్ ఇటీవల రాత్రికి రాత్రి మాయమైంది. పది లక్షల విలువైన సంబంధిత ఇనుప నిర్మాణం చోరీపై బస్ షెల్టర్ల నిర్మాణానికి బాధ్యత వహించే కంపెనీ అధికారి సెప్టెంబర్ 30న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, బెంగళూరులో బస్టాప్ షెల్టర్లు చోరీ కావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో హెచ్ఆర్బీఆర్ లేఅవుట్ వద్ద ఉన్న మూడు దశాబ్దాల నాటి బస్ షెల్టర్ రాత్రికి రాత్రే మాయమైంది. అలాగే 2015లో ఒక స్కూల్ సమీపంలో ఉన్న దూపనహళ్లి బస్ స్టాప్ కూడా రాత్రిపూట అదృశ్యమైంది. 2014లో కూడా రాజరాజేశ్వరినగర్లోని బీఈఎంఎల్ లేఅవుట్ 3వ స్టేజీ వద్ద ఉన్న 20 ఏళ్ల నాటి బస్టాప్ కనిపించకుండా పోయింది.