ముంబై: ఒక ప్రైవేట్ సంస్థ బస్సులో మంటలు చెలరేగాయి. ఎగ్జిట్ డోర్ తెరుచుకోలేదు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఉద్యోగుల్లో నలుగురు సజీవదహనమయ్యారు. (Employees Burn To Death) మరో ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో వ్యోమా గ్రాఫిక్స్కు చెందిన 12 మంది ఉద్యోగులు వార్జే నుంచి హింజేవాడికి కంపెనీ మినీ బస్సులో బయలుదేరారు.
కాగా, డస్సాల్ట్ సిస్టమ్స్ సమీపంలో ఆ బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ బస్సును స్లో చేశాడు. అయితే బస్సు ముందు భాగానికి మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని పసిగట్టిన నలుగురు ఉద్యోగులు ఆ మినీ బస్సు నుంచి కిందకు దిగారు. వెనుక కూర్చొన్నవారు ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ డోర్ తెరుచుకోలేదు.
మరోవైపు బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో నలుగురు ఉద్యోగులు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. బస్సులో కాలి మరణించిన నలుగురు ఉద్యోగుల మృతదేహాలను బయటకు తీశారు. కాలిన గాయాలైన ఐదుగురిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.