ఢిల్లీ : దేశంలో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పతనమవుతున్న రూపాయి విలువ దిగుమతులపై ప్రభావం చూపుతున్నది. దీంతో గత రెండు వారాలుగా వంటనూనెల ధరలు 5% వరకు పెరిగాయి. దాంతో పాటు దిగుమతి చేసుకుంటున్న కివీ, అవకాడో, పియర్స్, యాపిల్, నట్స్, డ్రైఫ్రూట్స్తోపాటు వివిధ రకాల పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. మన దేశంలో వినియోగించే వంటనూనెలో 60 శాతం వరకు దిగుమతి చేసుకునేదే కావడంతో రూపాయి పతనం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో సోయాబీన్, సన్ఫ్లవర్, పామాయిల్ ధరలు కిలోకు సుమారు రూ.5-6 వరకు పెరిగాయి.
గతేడాది డిసెంబర్ నుంచి చూసుకుంటే.. దిగుమతి చేసుకునే అవకాడో ధరలు 22 శాతం పెరిగాయి. డాలర్ బలపడటం, సరఫరా తగ్గడంతో డిసెంబర్లో రూ.360 ఉన్న కిలో అవకాడో ధర ఇప్పుడు రూ.440కి ఎగబాకింది. రాబోయే రోజుల్లో పండ్ల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మెట్రో నగరాల్లో ప్రీమియం యాపిల్స్ 8-10%, కివీ, అవకాడో, పియర్స్, బెర్రీ లాంటి పండ్ల ధరలు 10-15% వరకు పెరిగే చాన్స్ ఉన్నట్టు పేర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాగే రూపా యి పతనం కొనసాగితే వంటనూనెల ధరలు మరింత పెరిగే అవకాశమున్నట్టు సన్విన్ గ్రూప్ సీఈవో సందీప్ బజోరియా తెలిపారు.