గురువారం 03 డిసెంబర్ 2020
National - Feb 02, 2020 , 02:57:59

150 రైళ్లు ప్రైవేటుకు!

150 రైళ్లు ప్రైవేటుకు!

త్వరలో 150 రైళ్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుపుతామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రైవేటు సహకారంతో నాలుగు ప్రధాన రైల్వేస్టేషన్లను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగంలో రైల్వేశాఖ గురించి ప్రస్తావించిన మంత్రి ఆ శాఖకు రూ.70వేల కోట్ల మద్దతును, రూ.1.61 లక్షల కోట్ల ప్రణాళికా పెట్టుబడిని కేటాయిస్తున్నట్టు తెలిపారు. పట్టాల వెంట ఉండే రైల్వే ఆస్తుల్లో భారీ సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

  • అన్ని పర్యాటక కేంద్రాలకు తేజస్‌ రైళ్లు
  • పట్టాల వెంట సోలార్‌ ప్రాజెక్టులు..
  • బడ్జెటరీ మద్దతు రూ.70వేల కోట్లు

న్యూఢిల్లీ: దేశంలోని పర్యాటక ప్రాంతాలకు కొత్తగా తేజస్‌ వంటి రైళ్లను నడుపుతామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  తెలిపారు. ఢిల్లీ-ముంబై మధ్య ఎక్స్‌ప్రెస్‌వేను 2023 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఆ సమయంలోనే చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 27వేల కి.మీ రైలు మార్గాన్ని విద్యుదీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.  బెంగళూరు సబర్బన్‌ ప్రాజెక్టుకు 20 శాతం ఈక్విటీని ఇస్తామని చెప్పారు. ఆ మొత్తం రూ.18,600 కోట్లు కానుంది. త్వరగా పాడైపో యే వ్యవసాయ ఉత్పత్తులను వేగంగా రవాణా చేసేందుకుగాను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఒక ‘కిసాన్‌ రైలు’ను నడుపుతామని మంత్రి చెప్పారు. 


కొత్త మార్గాలకు రూ. 12వేల కోట్లు రైల్వేశాఖకు రూ.70 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం పెట్టుబడి వ్యయ ప్రణాళికను రూ. 1.61 లక్షల కోట్లుగా పేర్కొంది. బడ్జెట్‌ అంచనాల ప్రకారం.. 2020-21లో ప్రయాణికులు, సరుకు రవాణా, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని 9.5 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. కొత్త రైలు మార్గాల నిర్మాణానికి రూ.12వేల కోట్లు, గేజ్‌ మార్పిడి పనులకు రూ.2,250 కోట్లు, డబ్లింగ్‌ పనులకు రూ.700 కోట్లు కేటాయించారు.  సరుకు రవాణాకు రూ.5,786.97, సిగ్నల్స్‌  టెలికాం వ్యవస్థకు 1,650 కోట్లు నిర్దేశించారు. ప్రయాణికులకు సదుపాయాలు కల్పించేందుకు రూ.2,725.63 కోట్లు కేటాయించారు. ఆదాయానికి సంపాదించి.. ప్రయాణికుల చార్జీల ద్వారా రూ.61వేల కోట్లు, సరుకు రవాణా ద్వారా రూ.1.47లక్షల కోట్లు రాగలవని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని మార్గాల ద్వా రా రైల్వే శాఖ రూ.2,25,613 కోట్లను ఆర్జించగలదని అంచనా వేశారు. వేతనాల రూ పంలో రూ.92,993.07 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. 


ఆశలు నీరుగారాయి

రైల్వేశాఖ ఆర్థికంగా కుదేలవుతున్న నేపథ్యం లో ప్రభుత్వం దానికి ఉద్దీపన ప్యాకేజీని అందజేస్తుందన్న ఆశలు ఆ శాఖ ఉద్యోగుల్లో నీరుగారిపోయాయి. కేటాయింపులను బట్టిచూస్తే.. 2020-21లో ఆ శాఖ రూపాయి సంపాదించడానికి 96.2 పైసలను ఖర్చు పెట్టాల్సి ఉం టుంది. ఆపరేటింగ్‌ నిష్పత్తి (ఓఆర్‌)ను ప్రభు త్వం 96.2గా నిర్దేశించింది. ‘ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం స్థిరంగా ఉండగా, సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైల్వేకు ఉద్దీపన ప్యాకేజీ ఇస్తుందని ఆశించాము. కానీ ప్రభుత్వ బడ్జెట్‌ నిరుత్సాహ పరిచింది’ అని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు సుబోధ్‌ జైన్‌ పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో రైల్వే శాఖకు గానీ, రైల్వే ఉద్యోగులకు గానీ ఏమీ లేదని ఆల్‌ ఇండియా రైల్వే మెన్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివ్‌గోపాల్‌ మిశ్రా విమర్శించారు. 150 మార్గాల్లో 100 రైళ్లను నడిపేందుకు ప్రైవేటు రంగానికి అనుమతిస్తామని మంత్రి గత ఏడాది కూడా చెప్పారు. 


ఇండోర్‌-వారణాసి మధ్య ప్రైవేటు రైలు

పలు మార్గాల్లో రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరిచిన నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ త్వరలోనే తమ మూడో రైలును ఇండోర్‌, వారణాసి మధ్య నడుపనుంది. ఈ విషయాన్ని రైల్వే బోర్డ్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌యాదవ్‌ శనివారం వెల్లడించారు. హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని సదుపాయాలనే ఐఆర్సీటీసీ కూడా కల్పిస్తుందని చెప్పారు. ఐఆర్సీటీసీ ఇప్పటికే ఢిల్లీ - లక్నో, ముంబై  అహ్మదబాద్‌ మధ్య రైళ్లను నడుపుతున్నది. ఇండోర్‌- వారణాసి మధ్య ఈనెల 20 నుంచి రైలు ప్రారంభం కావచ్చని భావిస్తున్నామనియాదవ్‌ పేర్కొన్నారు.