Mayawati : బీఎస్పీ అధినేత్రి (BSP chief) మాయావతి (Mayavati) అధ్యక్షతన ఆ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలి ఎన్నిక కూడా ఈ సమావేశంలో జరిగే అవకాశం ఉంది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను వైదొలుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాయావతి కొట్టిపారేసిన మరుసటి రోజే ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
మాయావతి క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సోమవారం ఆమె కొట్టిపారేశారు. ‘కులవాద మీడియా’ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, గౌరవనీయులైన కాన్షీరామ్ జీ లాంటి బహుజనుల ఆశయాలను నిర్వీర్యం చేసే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడానికి తన చివరి శ్వాస వరకు బీఎస్పీ ఆత్మగౌరవం, ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం కావాలన్నదే తన నిర్ణయమని చెప్పారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తాను లేనప్పుడు లేదా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్పీ వారసుడిగా పార్టీ ప్రతిపాదించిందని మాయావతి తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇలాంటి తప్పుడు వార్తలను కుల మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఇలాంటి ప్రచారాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. గతంలో తనను రాష్ట్రపతిని చేస్తారన్న పుకార్లు కూడా వ్యాపించాయని మాయావతి గుర్తుచేశారు. రాష్ట్రపతి కావడమంటే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడమేనని, కాన్షీరామ్ శిష్యురాలిగా తాను ఆ పదవిని ఎలా అంగీకరిస్తారని..? ప్రశ్నించారు.
#WATCH | Uttar Pradesh: BSP chief Mayawati chairs national executive meeting of the party in Lucknow. Party’s national president likely to be elected today. pic.twitter.com/LZlsYiY5LD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 27, 2024