చండీగఢ్: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ పొరపాటున సరిహద్దు దాటాడు. పాకిస్థాన్ రేంజర్లు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. (BSF Jawan Held By Pakistan) ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ జవాన్ విడుదల కోసం ఇరు దేశాల మధ్య సైనికపరంగా చర్చలు జరుగుతున్నాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సరిహద్దులో ఈ సంఘటన జరిగింది. బుధవారం అక్కడ విధులు నిర్వహిస్తున్న 182వ బెటాలియన్‌కు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పీకే సింగ్ రైతులతో కలిసి చెట్టు నీటలో విశ్రాంతి తీసుతీసుకునేందుకు ముందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రేంజర్లు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ జవాన్ వద్ద ఉన్న సర్వీస్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమ ఆధీనంలో ఉన్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పీకే సింగ్ ఫొటోను విడుదల చేశారు.
కాగా, బీఎస్ఎఫ్ దీనిపై స్పందించింది. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పీకే సింగ్ విడుదల కోసం ఇరు దేశాల బలగాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరుగుతున్నదని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు సాధారణమేనని చెప్పారు. ఇరు దేశాల సైనికులు పొరపాటున సరిహద్దులు దాటిన సంఘటనలు గతంలో కూడా జరిగినట్లు వివరించారు.
మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఆంక్షలు విధిస్తున్నది. ఈ తరుణంలో బీఎస్ఎఫ్ జవాన్‌ను పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకోవడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.