మండి: తనను కలవాలనుకునేవారు ఆధార్ కార్డుతో రావాలని ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మండి నియోజకవర్గం నుంచి కంగనా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మీడియాతో మాట్లాడుతూ.. తనను కలుసుకునేవాళ్లు ఆధార్ కార్డుతో రావాలని, ఎందు కోసం తన వద్దకు వస్తున్నారన్న విషయాన్ని లేఖపై రాయాలని ఆమె అన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌కు భారీ సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారని, అందుకే మండి ప్రాంతానికి చెందిన ఆధార్ కార్డు ఉండాలని, మీరు ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారో లేఖలో రాయాలని ఎంపీ కంగనా పేర్కొన్నారు. అధిక సంఖ్యలో వచ్చే టూరిస్టుల వల్ల స్థానిక ప్రజలకు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు. హిమాచల్‌లోని ఉత్తర ప్రాంత ప్రజలు తనను మనాలీ ఆఫీసులో కలుసుకోవచ్చు అని, ఇక మండి సిటీ ప్రజలు తన ఆఫీసులో కలుసుకోవచ్చు అని ఆమె పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కలుసుకోవడమే బెటర్ అని ఆమె అన్నారు.
మండి లోక్‌సభ నియోజకవర్గంలో కంగనా చేతిలో ఓడిన కాంగ్రెస్ నేత విక్రమాధిత్య సింగ్ దీనిపై స్పందించారు. ఒకవేళ తనను ఎవరైనా కలవాలనుకుంటే ఆధార్ కార్డు అవసరం లేదని ఆయన అన్నారు. మన ప్రజలకు ప్రతినిధులమని, ఎవరినైనా కలవడం మన బాధ్యత అని, చిన్న పనైనా, పెద్ద పనైనా, వ్యక్తిగతమైనా .. ఐడెంటిటీ కార్డు అవసరం లేదని ఆయన అన్నారు. కలుసుకోవడానికి వచ్చినవాళ్లను ఐడీ అడగడం సరికాదు అన్నారు.