న్యూఢిల్లీ, జనవరి 20: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన శుక్రవారం మూడో రోజూ కొనసాగింది. రెజ్లింగ్ సమాఖ్యలో అక్రమాలు, తాము ఎదుర్కొంటున్న వేధింపులపై రెజ్లర్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)కి ఫిర్యాదు చేశారు. డబ్ల్యూఎఫ్ఐలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని, సీనియర్లకు ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరగట్లేదని ఆరోపించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన తర్వాత వినేశ్ ఫొగాట్‌ను బ్రిజ్‌భూషణ్ వేధించాడని, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్లిందని పేర్కొన్నారు. జాతీయ శిబిరంలో అర్హత లేని వారిని కోచ్‌లుగా, సిబ్బందిగా నియమించారని, వారంతా ఆయన అనుచరులేనని చెప్పారు. తాము ఎంతో ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తున్నామని, తమ ప్రాణాలకు ముప్పు ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఐవోఏ ముందు నాలుగు డిమాండ్లు ఉంచారు. లైంగిక వేధింపుల ఆరోణలపై దర్యాప్తునకు కమిటీ వేయాలని, బ్రిజ్‌భూషణ్‌ను వెంటనే తొలగించాలని, రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేయాలని, డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలు కొనసాగించేందుకు రెజ్లర్లను సంప్రదించి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
విచారణకు కమిటీ
బ్రిజ్‌భూషణ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణపై విచారణ జరిపేందుకు ఏడుగురు సభ్యులతో ఐవోఏ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, రెజ్లర్ యోగేశ్వర్, ఆర్చర్ డోలా బెనర్జీ, వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
వారిది ‘షాహీన్‌బాగ్’ నిరసన
రెజ్లర్ల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ తాను అన్ని రహస్యాలు బయటపెడితే సునామీ వస్తుందన్నారు. రెజ్లర్ల నిరసనను ‘షాహీన్ బాగ్ ధర్నా’తో పోల్చారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద పదవిలోకి రాలేదన్నారు. 22న డబ్ల్యూఎఫ్ఐ వార్షిక సాధారణ సమావేశం తర్వాత, లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ సమాధానం చెప్తారని ఆయన కుమారుడు ప్రతీక్ తెలిపారు.