న్యూఢిల్లీ, మే 21: మహిళా రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై మంగళవారం ఢిల్లీ కోర్టు లైంగిక వేధింపులు, బెదిరింపులు, మహిళల్ని కించపర్చడం తదితర అభియోగాలను నమోదుచేసింది. అయితే ఈ అభియోగాలను ఆయన తిరస్కరించారు. విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించారు. ‘నాపై వచ్చిన ఆరోపణల కారణంగా మా పార్టీకి మరిన్ని ఓట్లు పడతాయి’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ కేసులో సహ-నిందితుడు, మాజీ డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌పైనా క్రిమినల్ అభియోగాన్ని కోర్టు నమోదుచేసింది. మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలతో బ్రిజ్ భూషణ్‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్‌కు ఈసారి టికెట్ ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. ఆయన కుమారుడు కరణ్‌భూషణ్ సింగ్‌ను ఎన్నికల బరిలో నిలిపింది.