ముంబై, జూన్ 16 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఇంద్రాయణి నదిపై గల పురాతన ఐరన్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడినట్టు పుణె జిల్లా మావల్ తహసీల్ అధికారులు తెలిపారు. ఇక్కడి కుండ్మాల గ్రామం సమీపంలో నదిపైన ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు వంతెన కూలిపోయినట్టు చెప్పారు. కుప్పకూలిన వంతెన శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల్ని వెలికితీశామని, సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, గ్రామస్తులు, విపత్తు సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని అధికారి ఒకరు తెలిపారు.
కనీసం 38 మందిని ప్రమాదం నుంచి రక్షించామని, తీవ్రంగా గాయపడ్డ 18 మందిని వేర్వేరు దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు జిల్లా అధికారి ఒకరు చెప్పారు. ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సర్కార్ రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. వంతెన వద్దకు వందలాది మంది చేరుకుంటున్నా, అక్కడ పోలీసుల పర్యవేక్షణ లేకపోవటం ప్రమాదానికి దారితీసిందన్న ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపై విచారణ జరుపుతామని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ చెప్పారు.
పురాతన వంతెన తుప్పు పట్టిందని, కొత్త వంతెన నిర్మాణ ప్రణాళికకు ఓకే చేశామని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. ఈ అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నివారించగలిగిన ఈ ఘటనకు మహారాష్ట్ర సర్కార్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా అన్నారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి గిరీశ్ తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నది ప్రవాహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు పాత వంతెన పైకి వచ్చి నిలబడినందువల్లే వంతెన కూలిందని అన్నారు.