తమ జీవితాలను ఒకరితో ఒకరు పంచుకుంటామని, చనిపోయే వరకూ కలిసే ఉంటామని చేసుకునే పెళ్లిళ్లు.. చిన్న చిన్న కారణాలతోనే ఆగిపోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైపోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఇక్కడి ఒక గ్రామంలో నివశించే అమ్మాయికి.. పక్క ఊరికి చెందిన అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేశారు.
పెళ్లి కూతురి కుటుంబం ‘జైమాల్’ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది. అబ్బాయి వాళ్లు ‘బారత్’తో రాగానే అందరూ మండపానికి చేరుకున్నారు. అందంగా అలంకరించిన మండపంలో ‘జైమాల్’ జరగాల్సి ఉండగా.. అబ్బాయి తరఫు వాళ్ల బృందంలో ఎలాంటి ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు లేకపోవడం చూసింది వధువు. అంతే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.
తను ఆ పెళ్లి చేసుకోనంటూ మొండికేసింది. పక్క ఇంటికి వెళ్లి అక్కడే కూర్చుండిపోయింది. ఆమెను ఎంత మంది బతిమిలాడినా వినలేదు. ‘‘నాతో ఈ రోజు జరిగే పెళ్లి గురించే పెద్దగా పట్టించుకోని ఇలాంటి వాడు.. జీవితాంతం నన్ను సంతోషంగా ఉంచుతాడా?’’ అని ప్రశ్నించింది.
ఈ గొడవ అటు తిరిగి ఇటు తిరిగి పోలీస్ స్టేషన్కు చేరింది. అక్కడి అధికారుల ప్రమేయంతో అప్పటి వరకు రెండు కుటుంబాలు ఇచ్చిపుచ్చుకున్న కానుకలను వెనక్కు ఇచ్చేశారు. అనంతరం పెళ్లి కూతురు లేకుండానే ఆ వరుడు ఇంటికి తిరిగి వెళ్లాడని అధికారులు తెలిపారు.