Viral News | వరుడు తాగుతాడనో.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడన్న కారణాలతో అతనితో పెళ్లికి నిరాకరిస్తుండటం మనం ఇప్పటి వరకూ చూశాం. అయితే, ఉత్తరప్రదేశ్లో మాత్రం విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కుమారుడి ముక్కు చిన్నగా ఉందని చెప్పి ఏకంగా పెళ్లే ఇష్టం లేదని బాంబు పేల్చింది ఓ వధువు. అది కూడా మరికొద్ది నిమిషాల్లో పెళ్లనగా ఈ విషయాన్ని చెప్పి ఇంట్లో వాళ్లను షాక్కు గురిచేసింది.
వివరాల్లోకి వెళితే.. సంభాల్ జిల్లాలోని అస్మోలీ ప్రాంతానికి చెందిన ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. కాసేపట్లో పెళ్లనగా.. వరుడి కుటుంబం వధువు ఇంటికి ఊరేగింపుగా వచ్చింది. ఈ క్రమంలో యువతి ఇంట్లో బంధువులు, స్నేహితుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొందరు మహిళలు వరుడి ముక్కు చిన్నగా ఉందంటూ గుసగుసలాడటం మొదలు పెట్టారు. ఇది గమనించిన వధువు.. వరుడిని చూసేందుకు వెళ్లింది. నిజంగానే ముక్కు చిన్నగా ఉందని గ్రహించిన ఆమె.. తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ పెళ్లి తనకు వద్దని తెగేసి చెప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు వధువు నిర్ణయాన్ని మార్చుకోవాలని ఎంతగానో చెప్పారు. పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో చేసేదేమీ లేక వరుడి కుటుంబం అక్కడి నుంచి వెనుదిరిగింది.