న్యూఢిల్లీ: మాంసాహారం, నిద్ర లేమి, ఊబకాయం వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. వీటి కారణంగా రొమ్ము క్యాన్సర్ కేసులు ఏటా 5.6 శాతం పెరుగుతాయని అంచనావేసింది. సంతాన సమయం, హార్మోనల్ ఎక్స్పోజర్, కుటుంబ చరిత్ర కూడా భారతీయ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును ప్రభావితం చేస్తాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిసెర్చ్ (బెంగళూరు) నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2022లో కొత్తగా నమోదైన బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 23 లక్షలు కాగా, సుమారు 6,70,000 మంది మరణించారు. అదే సంవత్సరంలో భారత్లో 2,21,757 కేసులు నిర్ధారణ అయ్యాయి. రకరకాల క్యాన్సర్లతో బాధపడే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడేవారు 22.8 శాతం మంది. భారతీయ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు కారణాల గురించి 2024 డిసెంబర్ 22 వరకు ప్రచురితమైన సమాచారాన్ని కొన్ని భారతీయ సంస్థలు అధ్యయనం చేశాయి. ఈ నివేదికలను సమీక్షించి, తాజా నివేదికను రూపొందించారు.
గర్భస్రావంతో ముప్పు రెట్టింపు..!
50 ఏండ్ల వయసు లోపునే మెనోపాజ్ వచ్చిన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తక్కువగా కనిపించింది. 50 ఏండ్ల వయసు తర్వాత మెనోపాజ్ వస్తే ఈ రిస్క్ రెట్టింపు అయినట్లు వెల్లడైంది. పెళ్లి సమయానికి వయసును బట్టి రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరిగింది. గర్భస్రావం జరగని వారి కన్నా రెండుసార్ల కంటే ఎక్కువ గర్భస్రావం అయిన వారికి రొమ్ము క్యాన్సర్ ముప్పు 1.68 రెట్లు పెరిగింది. వయసు 30 ఏండ్ల పైబడిన సమయంలో మొదటి బిడ్డకు జన్మనిచ్చిన వారికి ఈ ముప్పు ఎక్కువగానే ఉంది. బిడ్డకు చనుబాలు ఇచ్చే సమయం ప్రభావం పెద్దగా కనిపించలేదు. అదేవిధంగా, ఓరల్ కాంట్రాసెప్టివ్స్ వాడకం ప్రభావం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అబ్డామినల్ ఒబెసిటీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగానే ఉంది.
ఒత్తిడి కూడా హానికరమే..
మాంసాహారానికి, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగడానికి సంబంధం ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. దైనందిన జీవ క్రియలు క్రమం తప్పడం వల్ల క్యాన్సర్ అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి సాక్ష్యాధారాలు పెరుగుతున్నాయి. నిద్ర లేమి వల్ల ఈ ముప్పు తీవ్రమవుతుంది. వేళాపాళా లేకుండా నిద్రపోవడం, కాంతి, వెలుగు ప్రసరించే గదిలో నిద్రపోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒత్తిడి స్థాయి తీవ్రంగా ఉండటం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ప్రతి 10 గ్రాముల ఆల్కహాల్ వినియోగానికి బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 7.1 శాతం పెరుగుతుందని కొలాబరేటివ్ గ్రూప్ ఆన్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ గుర్తించింది.