న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, అక్కడి హిందువులపై జరుగుతున్న దాడులపై దేశంలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. (breach at Bangladesh mission) త్రిపుర రాజధాని అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషన్ వద్ద సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ దేశంలో హిందువులపై వరుస దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది నిరసనకారులు బంగ్లాదేశ్ ఎంబసీ ప్రాంగణంలోకి దూసుకెళ్లారు.
కాగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సంఘటనను ఖండించింది. అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషన్ ప్రాంగణంలో భద్రతను ఉల్లంఘించడం చాలా విచారకరమని తెలిపింది. దౌత్య, కాన్సులర్ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యంగా చేసుకోకూడదని పేర్కొంది. ఈ సంఘటన నేపథ్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర డిప్యూటీ, అసిస్టెంట్ హైకమిషన్ల వద్ద భద్రతను పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
మరోవైపు బంగ్లాదేశ్లో హిందువుల లక్ష్యంగా జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలోని మైనారిటీలపై పెరుగుతున్న హింసాత్మక సంఘటనలను కేవలం మీడియా అతిశయోక్తిగా కొట్టి పారేయలేమని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.