లక్నో: యువతి కిడ్నాప్ కేసులో ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. యువతి స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని పోలీసులు భావించారు. అయితే మనస్తాపం చెందిన ఆ యువతి ఇంట్లో సూసైడ్ చేసుకుంది. (Girl Dies By Suicide) ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. గ్రామంలో ఇరుగుపొరుగున నివసించే 19 ఏళ్ల యువకుడు, 17 ఏళ్ల యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారు పెళ్లి చేసుకోవాలని భావించగా ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి.
కాగా, విడిపోవాలని కుటుంబాల నుంచి ఆ జంటపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో మే 13న వారిద్దరూ తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఈ విషయం తెలిసిన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఐదు రోజుల తర్వాత ఆ జంట ఆచూకీని పోలీసులు గుర్తించారు. యువకుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. యువతిని ఆమె కుటుంబానికి అప్పగించారు.
మరోవైపు కిడ్నాప్ కేసులో మరునాడు యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పోలీసులు భావించారు. అయితే ఆ రాత్రి భోజనం తర్వాత తన రూమ్‌లోకి వెళ్లిన ఆ యువతి నుదుటపై సింధూరం పెట్టుకుంది. చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడి అరెస్ట్‌తో మనస్తాపం చెందిన ఆ యువతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.