FWICE | సినిమాల షూటింగ్ కోసం మాల్దీవులకు వెళ్లకుండా.. భారత్లోని లొకేషన్లను ఎంపిక చేసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సినీ నిర్మాతలకు విజ్ఞప్తి చేసింది. భారత్ – మాల్దీవుల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో.. ఫెడరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల నేతలు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు నిరసనగా ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) మాల్దీవులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
ముగ్గురు మాల్దీవుల మంత్రుల అవమానకరమైన వ్యాఖ్యలను సాంకేతిక నిపుణులు, సీనియర్ కళాకారుల తరఫున ఖండిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల బాధ్యతారహితమైన తప్పుడు వ్యాఖ్యలకు సంఘీభావంగా వెస్ట్రన్ ఇండియా సినీ ఉద్యోగుల ఫెడరేషన్ మాల్దీవులలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. భారత్లో ఉన్న అలాంటి ప్రదేశాల్లోనే షూటింగ్ చేయాలని, దేశ పర్యాటక అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. సినీ నిర్మాతలందరికీ మాల్దీవుల్లో ఎలాంటి షూటింగ్, ప్రొడక్షన్ కార్యకలాపాలకు ప్లాన్ చేసుకోవద్దని.. దేశానికి, ప్రధానికి మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చింది.