Harsha Garg | ఆగ్రా, సెప్టెంబర్ 22: ఆగ్రా జిల్లాలోని ఖేరాగఢ్‌లో 17 ఏండ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన ఓ బాలుడు.. ఇప్పుడు లాయర్‌గా ఎదిగాడు. ఆపై తన అపహరణ కేసులో తానే తుది వాదనలు వినిపించి, ఆ కిడ్నాపర్లకు జీవిత ఖైదు పడేలా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. 2007 ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం కొందరు దోపిడీదారులు ఖేరాగఢ్‌లోని ఓ మెడికల్ షాపుపై దాడికి పాల్పడ్డారు. ఆ షాపు యజమానిపై కాల్పులు జరిపి, ఆయన కుమారుడు హర్ష గార్గ్ (7)ను కారులో అపహరించుకుపోయారు.
ఆపై తమకు రూ.55 లక్షలు చెల్లించాలంటూ హర్ష కుటుంబాన్ని బెదరించసాగారు. ఈ కేసులో పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో నక్కినట్టు 2007 మే 6న పోలీసులకు సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు కాపు కాశారు. ఆ సమయంలో హర్షను మోటర్ సైకిల్‌పై మరో స్థావరానికి తరలిస్తున్న క్రమంలో భయపడి వదిలేసిన హర్షను రక్షించి అతని కుటుంబం చెంతకు చేర్చిన పోలీసులు.. తర్వాత మొత్తం 14 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుపై దిగువ కోర్టు ఈ నెల 17న తుది విచారణ జరిపింది.
ఈ కేసులో ఏకధాటిగా 55 నిమిషాలపాటు తన వాదన వినిపించిన హర్ష గార్గ్.. నిందితుల తరఫు న్యాయవాది లేవనెత్తిన అభ్యంతరాలకు సైతం దీటుగా జవాబిచ్చాడు. దీంతో నిందితుల్లో 8 మందికి జీవిత ఖైదు విధించిన కోర్టు.. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నలుగురిని నిర్దోషులుగా తేల్చింది. మిగిలిన ఇద్దరు నిందితులు ఇప్పటికే మృతి చెందారు. 2015 నుంచి క్రమం తప్పకుండా ఈ కేసు విచారణకు హాజరవుతుండటంతో న్యాయవాది కావాలన్న కాంక్ష తనలో బలపడిందని, దీంతో 2022లో ఆగ్రాలోని ఓ కాలేజీలో లా డిగ్రీ పూర్తి చేశానని హర్ష గార్గ్ తెలిపారు.