న్యూఢిల్లీ: తల్లి మరణంపై ఒక బాలుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. మోమోలు అమ్మే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. (Teen Kills Momo Seller) దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జగత్ పురిలో నివసించే 35 ఏళ్ల కపిల్, మోమోలు అమ్మి జీవిస్తున్నాడు. భార్య అతడ్ని వీడి నేపాల్ వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు.
కాగా, మంగళవారం కపిల్ కత్తిపోటు గాయాలతో హాస్పిటల్లో చేరాడు. చికిత్స పొందుతూ మరణించాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. 15 ఏళ్ల బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా మోమోలు అమ్మే కపిల్‌ను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన తల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు చెప్పాడు.
మరోవైపు ఆ బాలుడు తన తల్లితో కలిసి మోమోలు విక్రయించే కపిల్ వద్ద పని చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే నెల రోజుల కిందట విద్యుదాఘాతంతో బాలుడి తల్లి చనిపోయిందని చెప్పారు. తల్లి మరణానికి కపిల్ కారణమని భావించిన ఆ బాలుడు పగతో అతడ్ని హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.