భోపాల్: డీజే మ్యూజిక్కు బాలుడు బలయ్యాడు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌కు తరలించగా గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. (Boy Dies Of DJ Music) ఈ విషయం తెలిసి ఆ బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక వేడుక సందర్భంగా పెద్ద శబ్దంతో డీజే ప్లే చేశారు. ఆ మ్యాజిక్కు అనుగుణంగా కొందరు వ్యక్తులు డ్యాన్స్ చేయడాన్ని 13 ఏళ్ల సమర్ బిల్లోర్ గమనించాడు. ఉత్సాహం ఆపుకోలేక ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అక్కడున్న వారితో కలిసి అతడు కూడా డ్యాన్స్ చేశాడు.
కాగా, పెద్ద శబ్దంతో కూడిన డీజే మ్యూజిక్‌తో డ్యాన్స్ చేస్తున్న సమర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది చూసి బాలుడి తల్లి ఆందోళన చెందింది. స్థానికులతో కలిసి హాస్పిటల్‌కు తరలించారు. అయితే గుండె వైఫల్యం వల్ల ఆ బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు తమ కుమారుడికి గుండె జబ్బు ఉందని, అయితే ఇప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్నాడని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. డీజే సౌండ్ పట్ల తాను ఎన్నిసార్లు హెచ్చరించినా వారు పట్టించుకోలేదని బాలుడి తండ్రి ఆరోపించాడు. తమ అబ్బాయి ప్రాణం పోయినా కూడా డీజే సందడిని వారు ఆపలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.