న్యూఢిల్లీ/మాండ్య, ఏప్రిల్ 3: కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. 2019లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పొటీ చేసి పరాజయం పాలయ్యారు. మథుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హేమమాలినిపై విజేందర్ సింగ్‌ను బరిలోకి దింపాలని హస్తం పార్టీ యోచిస్తున్నదని ప్రచారం జరుగుతున్న వేళ కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవడం ద్వారా ఆయన గట్టి ఝలక్ ఇచ్చినట్టు అయింది. విజేందర్ సింగ్ బాక్సింగ్‌లో భారత్ తరపున ఒలంపిక్స్‌లో తొలి పతకం సాధించారు.
మరోవైపు తాను బీజేపీలో చేరుతున్నట్టు కర్ణాటకలోని మండ్య నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ, సీనియర్ నటి సుమలత ప్రకటించారు. మండ్యలో ఎన్డీయే కూటమి తరపున పోటీచేస్తున్న జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామికి మద్దతు పలుకుతానని పేర్కొన్నారు. తాను మండ్యను వీడేది లేదని, రాబోవు రోజుల్లో కూడా ప్రజల కోసం పనిచేస్తానని సుమలత తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సుమలత బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై విజయం సాధించారు.