Sachin Pilot : జమ్ముకశ్మీర్, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 18 నుంచి అక్టోబర్ 1 వరకు మొత్తం మూడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో అక్టోబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 8న వెల్లడించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ స్పందించారు. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు భారీ మెజారిటీతో విజయం సాధిస్తాయని, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తంచేశారు. రెండు రాష్ట్రాల్లోనూ అధికార బీజేపీ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
హర్యానాలో పార్లమెంట్ ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు బీజేపీ ముఖ్యమంత్రిని మార్చిందని, దాంతో హర్యానాలో బీజేపీ తన ఓటమిని ఒప్పుకున్నట్లయ్యిందని సచిన్ పైలట్ చెప్పారు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ సర్కారు కొలువుదీరుతుందని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో గత కొన్నేళ్లుగా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని, కానీ అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నారని, కాబట్టి కాంగ్రెస్ పార్టీని, మిత్రపక్షాలనే గెలిపిస్తారని విశ్లేషించారు.