న్యూఢిల్లీ, జనవరి 3: గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఆలస్యమైనప్పుడు ఇండ్ల కొనుగోలుదారులకు డెవలపర్లతోపాటు భూమి యజమానులు కూడా పరిహారం చెల్లించాల్సిందేనని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ (ఎన్సీడీఆర్సీ) స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఇండ్ల కొనుగోలుదారులకు తాము కోల్పోయిన సొమ్మును తిరిగి రాబట్టుకోవడమే కాకుండా పరిహారం కూడా పొందే అవకాశం కలిగింది.
భాగస్వామ్య వెంచర్లలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు డెవలపర్లతోపాటు భూమి యజమానులు కూడా సమాన బాధ్యులేనని ఎన్సీడీఆర్సీ పేర్కొంది. డెవలపర్ పారిపోయినా లేక దివాలా తీసినప్పటికీ ఇండ్ల కొనుగోలుదారులకు ఈ తీర్పుతో లబ్ధి చేకూరుతుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. బెంగళూరుకు చెందిన యూనిషైర్ హోమ్స్ ఎల్ఎల్పీ సంస్థ 2017 నాటికి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి కొనుగోలుదారులకు హస్తగతం చేయాలి.
ఉత్తర బెంగళూరులో 2012లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇండ్ల కోసం కొనుగోలుదారులు రూ.1లక్ష నుంచి రూ.8 లక్షల వరకు చెల్లించారు. కానీ డెవలపర్లు అనుకున్న సమయానికి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. దీంతో 10 మంది కొనుగోలుదారులు ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు. ఇండ్ల నిర్మాణం దాదాపు ఆరేండ్లు ఆలస్యమైందని పేర్కొన్న కమిషన్ కొనుగోలుదారులకు ఆరు శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని డెవలపర్‌ను ఆదేశించింది.
ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ వినియోగదారులు మరోసారి రివ్యూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్సీడీఆర్సీ.. ఇండ్ల నిర్మాణం ఆలస్యం కావడానికి డెవలపర్తోపాటు ప్రాజెక్టులో భాగస్వాములైన భూమి యజమానులు కూడా బాధ్యులేనని తేల్చింది. కర్ణాటక రేరా 2019 డిసెంబర్లో జారీచేసిన ఒక సర్క్యులర్‌లో.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో లాభాలు పంచుకొనే భూ యజమానులను కూడా ప్రమోటర్లుగానే పరిగణించాలని తెలిపింది.
భూయజమాని పొందే లాభాల వాటాను తెలుపుతూ డెవలపర్ సదరు ప్రాజెక్టును రిజిస్టర్ చేయాలని పేర్కొంది. ‘పలు ప్రాజెక్టుల్లో డెవలపర్లు ఒక కంపెనీని ఏర్పాటుచేసి భూ యజమానులతో డెవలప్మెంట్ ఒప్పందం చేసుకుంటారు. కొనుగోలుదారుల నుంచి వారే అడ్వాన్స్‌లు లేదా పూర్తి మొత్తం డబ్బు వసూలు చేసుకుంటారు. అనూహ్య పరిస్థితుల్లో ప్రాజెక్టు ఆలస్యమైనప్పుడు లేదా మోసం చేయాలనుకున్నప్పుడు వారు అదృశ్యమైపోతుంటారు.
భూమి భూ యజమాని వద్దనే ఉంటుంది, డెవలపర్ కొనుగోలుదార్ల డబ్బుతో ఉడాయిస్తాడు. మధ్యలో మోసపోయేది కొనుగోలుదారులే’ అని కర్ణాటక హోం బయ్యర్స్ ఫోరం కన్వీనర్ ధనంజయ పద్మనాభాచార్ వివరించారు. ఈ నేపథ్యంలో భూ యజమానులను కూడా బాధ్యులను చేయాలని కొనుగోలుదారుల పక్షం న్యాయవాది కమిషన్ ముందు వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన ఎన్సీడీఆర్సీ.. గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో డెవలపర్తోపాటు భూ యజమానులు కూడా సమాన బాధ్యత వహించాలని తీర్పు చెప్పింది.