Bombay Highcourt | ముంబై : భార్య వస్త్రధారణ, వంట చేసే తీరుపై భర్త చేసే వ్యాఖ్యలు తీవ్ర క్రూరత్వం లేదా వేధింపుల కిందకు రావని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ కేసులో భర్తకు, అతని బంధువులకు శుక్రవారం విముక్తి కల్పించింది. భార్య సరైన విధంగా బట్టలు కట్టుకోవడం లేదని, సక్రమంగా వంట చేయడం లేదని భర్త సతాయిస్తూ ఉంటే, ఆ వ్యాఖ్యలను తీవ్రమైన క్రూరత్వం లేదా వేధింపులుగా పరిగణించలేమని తెలిపింది.
ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నపుడు, గోరంతలను కొండంతలుగా చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. అన్ని విషయాలను పెళ్లికి ముందే వెల్లడించినపుడు, భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 498ఏ పరిధిలోని క్రూరత్వం భావనలోకి ఇమిడేంత తీవ్రమైన ఆరోపణలు కానపుడు, విచారణను ఎదుర్కొనాలని భర్తను, అతని కుటుంబ సభ్యులను కోరడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమవుతుందని వివరించింది.