ముంబై : భర్తతో శారీరక సంబంధానికి నిరాకరించడం, ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానించడం క్రూరత్వమేనని, అటువంటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఇవి తగిన కారణాలేనని బాంబే హైకోర్టు తెలిపింది. కుటుంబ న్యాయస్థానం మంజూరు చేసిన విడాకులను సవాల్ చేస్తూ భార్య దాఖలు చేసిన అపీలును హైకోర్టు తిరస్కరించింది. అపీలుదారు (భార్య) ప్రవర్తనను ఆమె తన భర్త పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చునని తెలిపింది.
ఈ దంపతులిద్దరూ 2013లో వివాహం చేసుకున్నారు. 2014 డిసెంబరులో విడిపోయారు. భర్త 2015లో పుణేలోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తన భార్య క్రూరత్వం ప్రదర్శిస్తున్నందు వల్ల తమకు విడాకులు మంజూరు చేయాలని కోరారు. వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే తమ వివాహ బంధం తెగిపోవడం తనకు ఇష్టం లేదని భార్య పేర్కొంది. భర్త స్పందిస్తూ, ఆమె తనతో శారీరక సాన్నిహిత్యాన్ని తిరస్కరించిందని, తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానించిందని చెప్పారు.