ముంబై : తల్లిని చంపేసి, శరీర భాగాలను తినేసిన వ్యక్తికి కింది కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఇది నరమాంస భక్షణకు సంబంధించిన కేసు అని పేర్కొంది. దోషి సునీల్ కుచ్కోరవి 2017 ఆగస్ట్ 28న కొల్హాపూర్‌లోని తన ఇంట్లో తన తల్లి యల్లమ రమ కుచ్కొరవిని కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మెదడు, గుండె, కాలేయం, మూత్ర పిండాలు, ప్రేగులను పెనం మీద కాల్చి, కొన్నిటిని తినేశాడు.
మద్యం కోసం డబ్బులు ఇవ్వనందుకు ఇంత దారుణానికి పాల్పడ్డాడు. దోషి సునీల్‌కు కొల్హాపూర్ కోర్టు 2021లో మరణ శిక్ష విధించింది. అతనిని పుణేలోని యెరవాడ జైలుకు తరలించారు. తనకు మరణ శిక్ష విధించడంపై సునీల్ అప్పీల్ చేశాడు. హైకోర్టు అతడి అభ్యర్థనను తోసిపుచ్చి, మరణ శిక్షను సమర్థించింది.