Bomb Threat | కేరళలోని కొచ్చి నుంచి ఇండిగో విమానం 171 మంది ప్రయాణ తమిళనాడులోని చెన్నైకి శనివారం రాత్రి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికా, కేరళకు చెందిన ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ చివరకు బాంబు బెదిరింపుల దాకా వెళ్లింది. తమ వద్ద బాంబులు ఉన్నాయని.. విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులకు దిగడంతో మిగతా ప్రయాణికులంతా షాక్కు గురయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక భయం భయంగా కాలం గడిపారు.
బాంబు బెదిరింపు హెచ్చరికలను విమానంలోని పైలట్స్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో చెన్నై ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. విమానం ల్యాండ్ అయ్యేందుకు ముందే భద్రతా బలగాలతో అత్యవసర పరిస్థితుల్లో చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక ప్రయాణికులను దింపేశారు. ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఆ తర్వాత విమానాన్ని ఆధీనంలోకి తీసుకొని భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఆదివారం తెల్లవారు జామున వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించనట్లు సమాచారం. చివరకు ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతంలోనూ పలుసార్లు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విమానంలోనే ఇద్దరు ప్రయాణికులు గొడవపడి.. తమ వద్ద బాంబులు ఉన్నాయని.. పేల్చేస్తామడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.