తిరువనంతపురం : కొచ్చి నుంచి బెంగళూర్ వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందని (Bomb threat) కాల్ రావడంతో విమానంలో తనిఖీలు చేపట్టారు. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి 6ఈ6482 విమానం సోమవారం ఉదయం టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమవుతుండగా 10.30 గంటల ప్రాంతంలో విమానంలో బాంబు ఉందని కాల్ రిసీవ్ చేసుకున్నామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
దీంతో విమానంలో ప్రయాణీకులందరినీ దింపివేసి నిర్జన ప్రదేశంలో ఫ్లైట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్టు నెదుంబసరీ పోలీసులు తెలిపారు.
కాగా ఈనెల 18న ఢిల్లీ-పుణే విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో బాంబు ఉందని ఫోన్ కాల్ రావడంతో విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎనిమిది గంటల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆపై బాంబు బెదిరింపు కాల్ బూటకమని భద్రతా వర్గాలు, పోలీసులు తేల్చిచెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Read More :