Bomb Threat : ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) సెక్రెటేరియట్ (Secretariat) ను బాంబులతో పేల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు సుమారుగా మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పంపిన బెదిరింపు మెయిల్ (E-Mail) కలకలం రేపింది. సరిగ్గా మధ్యాహ్నం 3.30 గంటలకు సెక్రెటేరియట్ను పేల్చేస్తామని దుండగులు ఆ మెయిల్లో హెచ్చరించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి సీఎం సెక్రెటేరియట్లో తనిఖీలు చేశారు. ముందు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే తనిఖీల్లో బాంబుకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో మాదిరిగానే ఆకతాయిలు ఈ మెయిల్ పంపారని నిర్ధారణకు వచ్చారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించే పనిలోపడ్డారు. అదేవిధంగా ఢిల్లీలోని మౌలానా అజాద్ మెడికల్ కాలేజీకి కూడా ఇదేరకమైన బెదిరింపు మెయిల్ వచ్చిందని తెలిపారు. తనిఖీల్లో ఎలాంటి బాంబు ఆనవాళ్లు దొరకలేదని చెప్పారు. నిందితులను ట్రేస్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు.